తిరుమలతో పాటు ఏ ఆలయంలోనూ ప్రసాదాల కల్తీ వంటి ఘటనలు మాత్రమే కాదు ఆలయాల పవిత్రతకు భంగం కలిగేలా ఎటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పించి వారికే సర్వ అధికారాలు కల్పించే విధంగా నిర్ణయం తీసుకుంది.
అలా జోక్యం చేసుకోవటానికి వీల్లేదు
ఈ క్రమంలో దేవాదాయ కమిషనర్ తో పాటు ఏ స్థాయి జిల్లా అధికారి కూడా వైదిక విధులలో జోక్యం చేసుకోవడానికి వీలు లేదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఇకపై ఆలయాలలోని యాగాలు, పూజలు, కుంభాభిషేకాలు, ఇతరత్రా సేవలలో దేవాలయ అధికారుల పాత్ర పరిమితంగా ఉండబోతుంది. ఆయా కార్యక్రమాలలో అర్చకుల పాత్ర కీలకం కానుంది.
వైదిక విషయాలలో వారిదే తుది నిర్ణయం
పూజల విషయంలో అర్చకుల నిర్ణయమే ఫైనల్ గా నిలవనుంది. ఆధ్యాత్మిక విధులతో పాటు వైదికపరమైన విషయాలలో కూడా అర్చకుల నిర్ణయం ఫైనల్ గా మారనుంది. ఈ మేరకు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆలయాలలో అవసరమైనప్పుడు ఈవోలు వైదిక కమిటీలను వేసుకునే వెసులుబాటు ఉంది. ఒకవేళ ఆధ్యాత్మిక విషయాలలో ఏకాభిప్రాయం కుదరని పక్షంలో పీఠాధిపతుల సలహాలు తీసుకునే వెసులుబాటు కూడా ఉంది.
అర్చకులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త
ఆలయాల ఆగమ శాస్త్రాల ప్రకారం వైదిక విధులు నిర్వహించుకునేందుకు అర్చకులకు చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో స్వతంత్ర ప్రతిపత్తి కలగనుంది. చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయం అర్చకులకు సంతోషాన్ని కలిగిస్తుంది. చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయంతో ఆలయాలలో జరిపే పూజలు, హోమాలు, అభిషేకాల విషయంలో ఇకపై అధికారుల జోక్యం ఉండబోదు. అర్చకులదే ఫైనల్ నిర్ణయంగా ఉంటుంది.