2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో జగన్ విజయం సాధించారు. ఆ సమయంలో జగన్ అంతా గొప్ప నాయకుడు ఎవరూ లేరన్నట్టుగా ఆ పార్టీ నాయకులు గొప్పలు చెప్పారు. తీరా 2024 ఎన్నికల్లో జగన్ ఓడిపోయే సరికి జగన్ వల్లే పార్టీ ఇంత దారుణంగా ఓడిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ ఓటమితో చాలామంది నాయకులు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. సీనియర్ నాయకులు సైతం పార్టీని వీడుతున్నారు.
విశేషం ఏమిటంటే జగన్ నమ్మి అందలం ఎక్కించిన నాయకులు సైతం వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. కిలారు రోశయ్య, మద్దాలి గిరి, సిద్దా రాఘవరావు, మాజీ మంత్రి ఆళ్ల నాని , బాలినేని, సామినేని ఉదయభాను వంటి నేతలు వైసీపీకి రాజీనామా చేశారు. ముగ్గురు ఎమ్మెల్సీలు, ముగ్గురు రాజ్యసభ సభ్యులు సైతం వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. వీరిలో జగన్‌కు అత్యంత నమ్మకస్తులు కూడా ఉన్నారు. ఆళ్ల నాని , బాలినేని వంటి వారు జగన్‌కు ఆప్తులు. వీరికి జగన్ మంత్రి పదవులు కేటాయించారు. వీరు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు
బీద మస్తార్ రావు, మోపిదేవి వెంకట రమణ, ఆర్ కృష్ణయ్య వంటి రాజ్యసభ సభ్యులు తమ పదవులతో పాటు పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు కూడా వైసీపీని వీడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. . తాను వైసీపీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇదంతా తప్పుడు ప్రచారం అని తెలిపారు. ప్రజలు , పార్టీ శ్రేణులు ఈ వార్తలను నమ్మవద్దని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్‌తోనే నా ప్రయాణం అని ఆయన తేల్చేశారు. దేశంలో ఎవరూ చేయని విధంగా మాజీ సీఎం జగన్ తన పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని వ్యాఖ్యానించారు.
అన్ని కులాలతో సమానంగా దళితులకు పెద్ద పీట వేశారు. అలాంటి వ్యక్తిని, ఆ పార్టీ విలువలను వదిలి వెళ్లే ఆలోచన నాకు లేదు అని ఎమ్మెల్సీ రవీంద్రబాబు వెల్లడించారు. పండుల రవీంద్రబాబు గతంలో టీడీపీలో కొనసాగారు. 2014 ఎన్నికల్లో ఆయన అమలాపురం ఎంపీగా విజయం సాధించారు. 2019 ఎన్నికల ముందు ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో జగన్ ఆయనకు టికెట్ కేటాయించలేదు. అయినప్పటికీ రవీంద్రబాబు వైసీపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేశారు. తర్వాత రవీంద్రబాబును జగన్ ఎమ్మెల్సీని చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో రవీంద్రబాబు పార్టీ మారుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో ఆయన తాను పార్టీ మారడం లేదని వివరణ ఇచ్చారు.