YS Jagan:ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు బడ్జెట్ డాక్యూమెంట్స్‌లో చూపించింది ఒకటి..బయట ఆయన పార్టీకి నాయకులు చేస్తున్న ప్రచారం మరొకటని మండిపడ్డారు వైఎస్ జగన్. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారంటున్న విమర్శలకు వైసీపీ అధినేత పూర్తి క్లారిటీ ఇచ్చారు.YS Jagan: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కలపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్(YS Jagan) కూటమి ప్రభుత్వాన్ని సూటి ప్రశ్నలు వేశారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) ఆరు నెలల కాలంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం సాధ్యం కాదని తెలిసి…గత వైసీపీ పాలనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజల్లోకి తాము అప్పులు చేసినట్లుగా చూపిస్తూ చంద్రబాబు బొంకుల బాబుగా మారిపోయారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు వైసీపీ 14లక్షల కోట్ల అప్పులు చేసిందని చెప్పిన చంద్రబాబు అండ్ టీమ్.. బడ్జెట్ పత్రాల్లో మాత్రం 4లక్షల 91వేల కోట్ల అప్పులను చూపించడంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడున్నచంద్రబాబు ప్రభుత్వం చెప్పిన విధంగానే కాగ్ నివేదిక కూడా ఉండటంతో ..చంద్రబాబు వ్యవస్థల్ని వాడుకుంటూ వ్యవస్థీకృతి నేరాలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు వైఎస్ జగన్. ఆర్ధిక విధ్వంసకారుడు చంద్రబాబే అంటూ గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు.. ఆతర్వాత వైసీపీ పాలనలో జరిగిన అప్పులు,అభివృద్దిని బేరీజు వేసుకొని పూర్తి వివరాలు వెల్లడించారు జగన్.
టీడీపీదే విధ్వంసకర పాలన..
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ది జరగలేదని.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని.. వృద్ధిరేటు తగ్గిందని కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలకు వైఎస్ జగన్ తిప్పి కొట్టారు. గతంలో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టే నాటికి లక్షన్నర కోట్ల అప్పున్న రాష్ట్రాన్ని ఆయన పదవిలోంచి దిగిపోయే నాటికి అంటే 2018-19కి రూ.3లక్షల 13వేల కోట్ల రూపాయలు అప్పజెప్పారని అన్నారు. అదే వైసీపీ అధికారం చేపట్టే నాటికి రూ. 4లక్షల 91వేల కోట్ల అప్పులుంటే ఐదేళ్లు వైసీపీ పాలన తర్వాత 6లక్షల 46వేల కోట్ల రూపాయల అప్పులు చేసినట్లుగా అసెంబ్లీలో బడ్జెట్ పత్రాల్లో చూపించిన విషయాన్ని జగన్ ప్రత్యక్షంగా చూపించారు. కాని చంద్రబాబు అంటూ టీం మాత్రం వైసీపీ పాలనలో 14లక్షల కోట్ల అప్పులు చేశారని నోటికొచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారని.. తమకు అనుకూలంగా ఉన్న యెల్లో మీడియాలో గోబెల్స్ ప్రచారం చేయించి ప్రజల్ని మోసం చేశారని చెప్పారు.కాగ్ నివేదిక కూడా ఇదే విధంగా చెప్పిందని కాని చంద్రబాబు మాత్రం 14 లక్షల కోట్లు అని ఎన్నికలకు ముందు ప్రజలకు అబద్దం చెప్పడం ధర్మమేనా అని ప్రశ్నించారు.
వ్యవస్థీకృత నేరాలు..
ప్రస్తుతం అధికారంలో చంద్రబాబే ఉన్నారు. 6నెలలుగా ప్రభుత్వ యంత్రాంగం చంద్రబాబు చేతుల్లో ఉంది. బడ్జెట్ లెక్కలు, కేటాయింపులు తయారు చేయించి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మరి అలాంటప్పుడు మేం 14 లక్షల కోట్లు అప్పులు చేశామని వారి పార్టీకి చెందిన నేతలు అబద్దం చెబుతూ బొంకుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబును బొంకుల బాబు ఎందుకు చూడకూడదన్నారు జగన్
పథకాలకు పంగనామం పెట్టేందుకేనా..
ఎన్నికలకు ముందు ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పి..ఇప్పుడు ఎగ్గొట్టేందుకే ఈ తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు జగన్. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో రెండేళ్లు కరోనా వల్ల రాష్ట్రంలో ఆదాయం తగ్గి..ఖర్చులు పెరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆవిధంగా చూసుకున్న దేశ వృద్ధిరేటుతో పోలిస్తే రాష్ట్ర వృద్ధిరేటు ఎక్కువగానే ఉందన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో మేం పద్దతిగా పాలన సాగించామని.. తొలిసారి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు FRBM పరిధికి మించి అప్పులు చేశారని లెక్కలతో సహా ఆధారాలు చూపించారు జగన్.
Author: VS NEWS DESK
pradeep blr