విశాఖ పోలీస్ కమిషనరేట్ లో అందరూ హడావిడిగా ఉన్నారు. క్రైమ్ రికవరీ మేళాలో స్వాధీనం చేసుకున్న సొత్తును అందరికీ అందజేస్తున్నారు పోలీసులు. ఈ లోగా ఓ బామ్మ ఆత్రుతగా ముందుకు వచ్చింది.. పోలీసులకు చేతులెత్తి మొక్కింది.. ఆనంద భాష్పాలు కార్చింది.. ఎందుకో తెలుసా..? పదిహేను ఏళ్ల తర్వాత తన కష్టం తనకు దక్కే అవకాశం వచ్చినందుకు..పూర్తి వివరాల్లోకి వెళితే..
కష్టపడి సంపాదించిన సొత్తు.. పైసా పైసా కూడగట్టి చేయించుకున్న నగలు.. పరుల పాలైతే.. ఆ దుఃఖం తీర్చలేనిది. పేద మధ్యతరగతి ప్రజల సొత్తు దొంగలు తీసుకెళ్తే ఆ బాధ వర్ణనాతీతం. అటువంటి వారికే విశాఖ సిటీ పోలీసులు భరోసా కల్పిస్తూ పోగొట్టుకున్న సొత్తును తిరిగి అప్పగిస్తున్నారు. 72కేసుల్లో 102మందిని అరెస్ట్ చేసిన విశాఖ సిటీ పోలీసులు అక్టోబర్ నెలకు సంబంధించి భారీగా రికవరీ చేశారు. 72 కేసులను చేదించి 102 మందిని అరెస్ట్ చేశారు. 88 లక్షల విలువచేసే చోరీ సొత్తును రికవరీ చేశారు. వాటిలో 742 గ్రాముల బంగారం, 326 గ్రాముల వెండి, 2.88 లక్షల నగదు, 20 టూ వీలర్లు మూడు ఆటోలు, ఓ ట్యాంకర్, 298 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. కోర్టు ఆదేశాలతో బాధితులకు అందజేశారు సిపి బాగ్చి.
బాధితుల్లో ఆనందం మాములుగా లేదు..
అయితే.. ఈ రికవరీ లో ఓ బామ్మ ప్రత్యేకంగా కనిపించింది. ఆమెకు గొలుసు అందజేయగానే ఆనంద భాష్పాలు రాల్చింది. ఇదిగో ఈమె పేరు కాలా అనసూయమ్మ. వయసు 79 సంవత్సరాలు. ఊరు రాజమండ్రి సమీపంలోని శ్రీరంగపట్నం. పోలీసులకు చేతులెత్తి మొక్కింది. ఆమె ఊరు కాని ఊరు వచ్చి.. ఎవడో మాటను నమ్మి దోపిడీకి గురైంది ఆమె. అది కూడా 2009 ఆగస్టులో. కూతురు ఇంటికి వెళుతూ ఓ మాయలోడి మాటల్లో పడి ఆ సమయంలో ఏడు తులాల బంగారాన్ని కోల్పోయింది. తన శరీరంపై కాణి బంగారం లేకుండా అంతా కోల్పోయింది.
కాళ్ళరిగేలా తిరిగి..ఎట్టకేలకు…
అప్పుడు నుంచి కాళ్లు అరిగేలా పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగింది ఆమె. కలెక్టర్కు స్పందనలో ఫిర్యాదులు కూడా చేసింది. రాజమండ్రి నుంచి వస్తు వెళ్తూ తన బంగారం దొరికిందా అని 15 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతోంది. ఎట్టకేలకు విశాఖ పోలీసులు ఓ కేసులో నిందితుడుని పట్టుకుంటే.. ఈ బామ్మ బంగారం బయటపడింది. దీంతో 15 ఏళ్లుగా నిరీక్షణకు తెరపడినట్లు అయింది. బంగారం గొలుసు చూసుకుంటూ తెగ మురిసిపోయింది ఆ బామ్మ అనసూయమ్మ.
ఇంట్లోకి చొరబడి..అయిదుళ్లకు..!
ఇక మరో బాధితురాలు బామ్మ సరిపల్లి కనకమ్మ. పెందుర్తి దగ్గువానిపాలెంలో నివాసం ఉంటున్న ఈ కనకమ్మ.. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దోపిడీ జరిగింది. ఈ ఘటన జరిగి ఐదేళ్ల అవుతుంది. ఇంట్లోకి చొరబడి నోరు గొంతు నొక్కి తులం బంగారాన్ని ఎత్తుకెళ్లాడు దొంగ. ఎట్టకేలకు ఆ దొంగ దొరకడంతో ఐదేళ్ల తర్వాత పోయిన సొత్తు ఆమె సొంతమైంది. దీంతో తన గొలుసును చూసుకుంటూ సంబర పడిపోయింది తాడేపల్లి కనకమ్మ. పోలీస్ బాబులకు రుణపడి ఉంటానని చెబుతోంది.
అదే మాధ్యేయం.. సిపి
పెద్దోళ్ళు అయితే ఓకే.. కానీ ఇటువంటి పేదవాళ్ల కు మరింత ఆసరాతో భరోసా ఇవ్వాలని తమ ధ్యేయమని అంటున్నారు పోలీస్ బాస్. పోగొట్టుకున్న సొత్తును చూసి వారి కళ్ళల్లో ఉన్న ఆనందం కంటే తమకు కలిగే తృప్తి ఏముంటుందని అంటున్నారు సిపి బాగ్చి.
ఇదండీ బామ్మ బంగారం కథ..! క్రైమ్ రికవరీలో.. స్టేట్ లోనే యమా ఫాస్టుగా ఉన్న విశాఖ సిటీ క్రైమ్ టీమ్ కి అభినందించారు సిపి. ఇదే స్ఫూర్తితో పనిచేసే ప్రజలకు భరోసా కల్పించాలని సూచించారు.
Author: VS NEWS DESK
pradeep blr