మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం పాత్ర మరోసారి చర్చనీయాంశమైంది. తాజాగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం తర్వాత విపక్ష మహా వికాస్ అఘాడీ నేతలు దీనిపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈవీఎంలను మేనేజ్ చేసి బీజేపీ ఇక్కడ గెలిచిందని ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు వాటికి ఆధారంగా మరికొన్ని అంశాలు బయటపడ్డాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లకూ, లెక్కించిన ఓట్లకూ మధ్య తేడా 5 లక్షలుగా తేలింది.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన లెక్కల ప్రకారం మహారాష్ట్రలో తుది ఓటింగ్ శాతం 66.05. మొత్తం పోలైన ఓట్లు 64,088,195.ఇందులో 30,649,318 స్త్రీలు, 33,437,057 పురుషులు ఉన్నారు. అలాగే ఇతరులు 1820 కూడా ఉన్నారు. అయితే కౌంటింగ్ చేసిన మొత్తం ఓట్లు మాత్రం 64,592,508. పోలైన మొత్తం ఓట్లతో పోలిస్తే ఇది 504,313 ఓట్లు ఎక్కువ. అంటే పోలైన ఓట్ల కంటే కౌంట్ చేసిన ఓట్లు 5 లక్షలకు పైగా ఉన్నాయి. దీనిపై ఈసీ స్పందించలేదు.
మరోవైపు రాష్ట్రంలోని ఎనిమిది నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే తక్కువగా ఓట్లు లెక్కించినట్లు తాజా గణాంకాలు చెప్తున్నాయి. అలాగే మిగిలిన 280 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు మించి ఓట్లు లెక్కించారు. పోలైన ఓట్ల కంటే 4,538 ఓట్లు ఎక్కువగా లెక్కించబడిన అష్టి నియోజకవర్గంలో, ఉస్మానాబాద్ నియోజకవర్గంలో 4,155 ఓట్ల తేడా నమోదైంది. ఈ తేడా లోక్సభ ఎన్నికల సమయంలో ఓటరు ఓటింగ్ డేటా, ప్రతి పోలింగ్ స్టేషన్లో పోలైన ఓట్ల సంఖ్యను నమోదు చేసే ఫారమ్ 17Cకి సంబంధించి నెలకొన్న వివాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. దీనిపై ఇప్పుడు రాజకీయంగా రచ్చ మొదలైంది.
Author: VS NEWS DESK
pradeep blr