ఆళ్ల నాని టీడీపీలోకి ఎంట్రీ పై తేల్చేసిన చంద్రబాబు..!!

ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి పార్టీలు వైసీపీని లక్ష్యంగా చేసుకున్నాయి. ఎన్నికల్లో ఓడిన తరువాత పలువురు వైసీపీ నేతలు కూటమి పార్టీలోకి చేరారు. మరి కొందరు చర్చ లు కొనసాగిస్తున్నారు. పశ్చిమ గోదావరి నుంచి పలువురు వైసీపీ ముఖ్యులు టీడీపీతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని టీడీపీలోకి ఎంట్రీ పైన జిల్లా పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం పైన చంద్రబాబు తన అభిప్రాయం ఏంటో స్పష్టం చేసారు.

టీడీపీలో చేరిక వేళ
మాజీ సీఎం జగన్ సన్నిహిత నేత.. డిప్యూటీ సీఎంగా పని చేసిన ఆళ్ల నాని గతంలోనే వైసీపీకి రాజీనామా చేసారు. తాను రాజకీయంగా కొనసాగలేనని నాడు తన లేఖలో స్పష్టం చేసారు. కానీ, ఇప్పుడు టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. జగన్ పార్టీ ఏర్పాటు నుంచి ఆళ్ల నాని వైసీపీలో కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో ఏలూరు నుంచి గెలిచిన నానికి జగన్ కేబినెట్ లో కాపు వర్గం నుంచి డిప్యూటీ సీఎంగా అవకాశం దక్కింది. కరోనా సమయంలో వైద్య, ఆరోగ్య శాఖా మంత్రిగా పని చేసారు. తాజా ఎన్నికల్లో నాని ఓడిపోయారు. ఇప్పుడు టీడీపీలో చేరే సమయంలో ఆ పార్టీ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

బడేటి అభ్యంతరం
ఆళ్ల నాని టీడీపీలో చేరటం పైన ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తన అభిప్రాయం వెల్లడించారు. నాని చేరిక పైన మరోసారి ఆలోచన చేయాలని కోరారు. నాని వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏలూరులో టీడీపీ శ్రేణులను వేధించారని చెప్పుకొచ్చారు. పలువురి పైన అక్రమ కేసులు పెట్టారని.. వారు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. ఆయన టీడీపీలోకి తీసుకొంటున్నారనే సమాచారం పైన పార్టీ కేడర్ అసహనంగా ఉందని వివరించారు. పలువురి టీడీపీ శ్రేణుల ఇళ్లను కూలగొట్టించిన నానికి పార్టీలో స్థానం కల్పించవద్దని కోరినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు క్లారిటీ
ఆళ్ల నాని టీడీపీలో చేరటం వలన ఎలాంటి ప్రయోజనం లేదని బడేటి రాధాకృష్ణ పేర్కొన్నారు. దీని పైన మరోసారి ఆలోచించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. బడేటి చెప్పిన అంశాల పైన చంద్రబాబు స్పందించారు. పార్టీ నేతల అభిప్రాయాలను..బడేటి చెప్పిన విషయాలను పూర్తి గా పరిశీలించిన తరువాతనే నిర్ణయం ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే, పార్టీ బలోపేతం కోసం తీసుకొని తీసుకునే నిర్ణయాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సహక రించాలని చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో, ఇప్పుడు ఆళ్ల నాని విషయంలో చంద్రబాబు తుది నిర్ణయం ఏంటనేది ఏలూరు టీడీపీలో ఆసక్తి కరంగా మారుతోంది.

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು