తిరుమలకు వెళ్లే భక్తులకు సూచనలు: టికెట్ల జారీ తేదీల్లో కీలక మార్పులు చేసిన టీటీడీ

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. గురువారం నాడు 58,165 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 20,377 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.60 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 29 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 నుంచి 17 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

ఈ తేదీలు- మార్చి నెలకు సంబంధించిన శ్రీవాణి కోటా, 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ల తేదీలు కలిసి వచ్చాయి. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే- శ్రీవాణి ట్రస్ట్ దాతలకు దర్శనం, వసతి గదుల కోటా ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

మార్చిలో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఈ నెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు టికెట్లను విడుదల చేయాల్సి ఉంది. వైకుంఠ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను కూడా డిసెంబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను డిసెంబరు 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయాల్సి ఉంది.

అటు మార్చి నెల కోటా, ఇటు వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను ఒకే తేదీన, ఒకే సమయానికి ఆన్‌లైన్‌లో విడుదల చేయాల్సి రావడం వల్ల భక్తులు ఇబ్బందులకు గురి అవుతారని భావించారు టీటీడీ అధికారులు. అందుకే ఇందులో మార్పులు చేశారు. మార్చి నెల శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల తేదీలను తాజాగా సవరించారు.

ఈ నెల 25వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అలాగే- 26వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అదే రోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను అందుబాటులో ఉంచుతారు.

ఈ తేదీల్లో మార్పును భక్తులు గమనించుకోవాలని, టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in లో మాత్రమే వాటిని బుక్ చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr