ప్రకాశం జిల్లాలో మరోసారి భూమి స్వల్పంగా కంపించింది. ముండ్లమూరులో ఈ రోజు ఉదయం 11గంటల ప్రాంతంలో ఒక సెకను పాటు భూమి కంపించినట్టు గుర్తించారు. ముండ్లమూరుతో పాటు మారెళ్ళ, సింగన్నపాలెం గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించింది. 24 గంటల వ్యవధిలోనే రెండు సార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ప్రకాశం జిల్లాలో మరోసారి భూమి స్వల్పంగా కంపించింది. ముండ్లమూరులో ఈ రోజు ఉదయం 11గంటల ప్రాంతంలో ఒక సెకను పాటు భూమి కంపించినట్టు గుర్తించారు. ముండ్లమూరుతో పాటు మారెళ్ళ, సింగన్నపాలెం గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించింది. నిన్న ఉదయం 10. 30 గంటలకు దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు, కురిచేడు మండలాల్లోని పలు గ్రామాల్లో రెండు సెకన్లపాటు భూమి కంపించినట్టు గుర్తించారు. నిన్న భూమి కంపించిన ముండ్లమూరులోని స్కూల్లో విద్యార్ధులు భయంతో బయటకు పరుగులు పెట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్ళల్లో ఉన్న ప్రజలు భూ ప్రకంపనాలను గుర్తించి రోడ్లపైకి వచ్చారు.
ఈ ప్రకంపనలు స్వల్పంగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్థినష్టం జరగలేదు. ముండ్లమూరు మండలంలోని శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడు, ముండ్లమూరు గ్రామాల్లో ప్రకంపనలు గుర్తించారు. అలాగే తాళ్ళూరు మండలం గంగవరం, తాళ్లూరు, రామభద్రపురంలలో స్పల్పంగా భూమి కంపించింది. కురిచేడు, దర్శి మండలాల్లో అక్కడక్కడ భూమి కంపించినట్టు చెబుతున్నారు.
తిరిగి ఆరోజు ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్ళ గ్రామాల్లో ఒక సెకనుపాటు భూమి కంపించడంతో జనం ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా ఒకే ప్రాంతంలో భూమి కంపించడం వెనుక కారణాలను గుర్తించాలని అధికారులను కోరుతున్నారు. రానున్న రోజుల్లో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయో అంచనా వేయాలని, ఎలాంటి ప్రమాదం లేకుంటే ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు.
గ్రానైట్, ఇసుక తవ్వకాలే కారణమా..
ప్రకాశం జిల్లాలో గ్రానైట్ తవ్వకాలు, ఇసుక అక్రమ రవాణా కారణంగా భూగర్భజలాలు అడుగంటి పోవడం, లోతుగా తవ్వకాలు జరగడం వల్ల ఈ ప్రాంతాల్లో తరచుగా భూమి కంపిస్తున్నట్టు భావిస్తున్నారు. చీమకుర్తి నుంచి బల్లికురవ వరకు గ్రానైట్ నిక్షేపాల కోసం వందల అడుగుల లోతు భూమిని తవ్వేస్తున్నారు. అలాగే దర్శి నియోజకవర్గం ముండ్లమూరు, తాళ్ళూరు మండలాల్లో వాగులు, ఇసుక నేలల్లో అక్రమంగా నిబంధనలను అతిక్రమించి ఇసుకను తోడేస్తున్నారు. దీనికి తోడు ఇటీవల కాలంలో వరుస తుఫాన్ల కారణంగా వర్షాలు పడుతుండటంతో ఈ ప్రాంతాల్లోని భూమి పొరల్లో సర్దుబాటు కారణంగా ఈ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయన్న అనుమానాలు ఉన్నాయి.
ప్రస్తుతం దర్శి నియోజకవర్గం పరిధిలోని ముండ్లమూరు, తాళ్ళూరు మండలాల్లో చోటు చేసుకున్న భూ ప్రకంపనలు స్వల్పంగా ఉండటంతో ఎలాంటి అందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.
Author: VS NEWS DESK
pradeep blr