నిన్న వైసీపీ నేతల దాడిలో గాయపడిన వైఎస్సార్ జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పవన్ కళ్యాణ్ ఇవాళ కడప రిమ్స్ లో పరామర్శించారు. గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి చేసిన వ్యక్తి గతంలో లాయర్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. వాళ్ల అమ్మ ఎంపీపీ అని, ఆమె ఆఫీసులో వెళ్లేందుకు వీళ్లకు అనుమతి లేకపోయినా ఎంపీడీవో వద్దకు వెళ్లి తాళాలు ఇవ్వకపోతే దాడి చేశారన్నారు. ఓ మండలానికి కలెక్టర్ లాంటి ఎంపీడీవోపై దాడి చేయడం దారుణం అన్నారు. ఇది ఒక్కరిపై జరిగిన దాడి కాదని, రాష్ట్ర యంత్రాంగంపై జరిగిన దాడి అని పవన్ అభివర్ణించారు. వైసీపీ అహంకారం తగ్గే వరకూ మిమ్మల్ని వదలం అన్నారు.
అహంకారంతో కొట్టుకునే వైసీపీ ఈ పరిస్ధితికి వచ్చిందని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. జల్లా సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి చేశారని పవన్ ఆరోపించారు. ఇతనికి దాడులు కొత్త కాదన్నారు. గతంలో ఎంపీడీవోలు ప్రతాప్, శేఖర్ నాయక్, శ్రీనివాసులురెడ్డిపై దాడులు చేశారన్నారు. ఇది వీరి అడ్డా అనుకుంటున్నారని తెలిపారు. పదవిలో ఉన్న వ్యక్తికి తాళాలు ఇస్తాం, మీకు ఇవ్వం అంటే దాడి చేశారన్నారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని కులం పేరుతో దూషించి దాడి చేశారని ఆరోపించారు.
ఇది గత ప్రభుత్వంలా కాదని, ఇష్టారాజ్యంగా చేస్తామంటే కుదరదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అధికారులపై దాడులు చేస్తే సహించబోమన్నారు. దీనిపై కలెక్టర్ కూడా స్పందించారన్నారు. వైసీపీ నేతల అహంకారం నడినెత్తిమీద ఉందని, తోలు తీసి కింద కూర్చోబెడతామన్నారు. ఇలాంటి వాళ్లపై ఎలాంటి శిక్షలు వేయాలో ఆలోచిస్తామన్నారు. ఈ ప్రభుత్వం త్రికరణ శుద్ధిగా పనిచేస్తుందని, ఇషారాజ్యంగా చేస్తామంటే ఈ ప్రభుత్వంలో కుదరదన్నారు. 11 సీట్లు వచ్చినా వైసీపీ గాల్లో విహరిస్తోందని పవన్ వ్యాఖ్యానించారు. అధికారుల విధులు అడ్డుకుంటే తీవ్ర చర్యలు తప్పవన్నారు. ఆధిపత్య ధోరణితో దాడులు చేసి, విధి నిర్వహణను అడ్డుకుంటే ఉపేక్షించబోమన్నారు.