మహారాష్ట్రలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో మహరాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అధికార మహాయుతి కూటమితో పాటు విపక్ష మహావికాస్ అఘాడీ కూటములకు దూరంగా ఉంటామని ఆయన ప్రకటించారు. అంతే కాదు వచ్చే ఎన్నికల్లో తాము భారీ ఎత్తున సీట్లలో పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు. దీంతో ఇరు కూటముల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
మహారాష్ట్రలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా పోటీ అధికార ఎన్డీయే కూటమితో పాటు విపక్ష మహావికాస్ అఘాడీ మధ్యనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే రాజ్ థాక్రే చేసిన ప్రకటనతో 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో పోటీ త్రిముఖం కాబోతోంది. రాష్ట్రంలో ఎన్డీయే సర్కార్ అధికారంలో ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని ఆరోపణలు గుప్పిస్తున్న రాజ్ థాక్రే ఈసారి తమ పార్టీ తరపున ఏకంగా 225 నుంచి 250 సీట్లలో అభ్యర్ధుల్ని నిలబెట్టాలని భావిస్తున్నారు.దీంతో రాజ్ థాక్రే పార్టీ పోటీ ఇరు కూటముల్లో ఎవరిని ముంచబోతోందన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అధికార కూటమిపై ఉన్న వ్యతిరేకతను విపక్ష మహావికాస్ అఘాడీ పూర్తిగా సొమ్ము చేసుకోకుండా రాజ్ థాక్రే ఈ ఎత్తుగడ వేశారన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే భారీ ఎత్తున సీట్లలో ఎంఎన్ఎస్ పోటీ చేస్తే మాత్రం కచ్చితంగా ఆ ప్రభావం అధికార కూటమిపైనా పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు కూటములు రాజ్ థాక్రే ప్రకటనపై ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది.