షాకింగ్: నెలన్నర రోజులుగా రెక్కీ- భారీ మొత్తంలో సుపారీ..!!

Baba Siddique: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ దారుణ హత్యకు గురి కావడం మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. ఎన్నికల ముంగిట్లో ఉన్న మహారాష్ట్ర రాజకీయాల్లో సునామీ పుట్టించింది. అధికారంలో ఉన్న శివసేన- భారతీయ జనతా పార్టీ- ఎన్సీపీ కూటమి ఆత్మరక్షణలో పడింది.

అన్ని రాజకీయ పార్టీలు సిద్ధిక్ హత్యోదంతం పట్ల స్పందించాయి. కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం), శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం), సమాజ్‌వాది పార్టీ, ఏఐఎంఐఎం, ఆయా పార్టీలకు చెందిన మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు – సంకీర్ణ కూటమి సర్కార్‌పై నిప్పులు చెరుగుతున్నాయి. ముంబై సహా రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతలు క్షీణించాయంటూ ధ్వజమెత్తుతున్నాయి.

బాబా సిద్ధిక్ హత్యకేసులో ముంబై పోలీసులు పురోగతి సాధించారు. ఇప్పటివరకు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిని హర్యానా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కర్నాల్ సింగ్, ధరమ్ రాజ్ కశ్యప్‌గా గుర్తించారు. వారి అరెస్ట్‌ను ముంబై అదనపు పోలీస్ కమిషనర్ పరంజిత్ సింగ్ దహియా ధృవీకరించారు.

బాబా సిద్ధిక్ హత్య కేసులో మొత్తం ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరకు కర్నాల్ సింగ్, ధరమ్ రాజ్ కశ్యప్‌‌ను అరెస్ట్ చేశామని, మరో నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తోన్నామని అన్నారు. దీనికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఈ ముగ్గురు కూడా నెలన్నర రోజుల పాటు సిద్ధిక్ నివాసం, ఆయన కార్యాలయం, ఆయన తరచూ రాకపోకలు సాగించే ఇతర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు ముంబై పోలీసులు తెలిపారు. దీనికోసం ముంబైకి తమ మకాం మార్చుకున్నారని, ప్రతి రోజూ సిద్ధిక్‌ కదలికలపై ఆరా తీస్తూ వచ్చారని చెప్పారు. ఈ విషయాన్ని నిందితులు అంగీకరించారని అన్నారు.

హత్య చేసిన రెండు గంటల వ్యవధిలోనే నిందితులను ముంబై పోలీసులు పట్టుకోగలిగారు. ఎనిమిది గంటలుగా వారిని ప్రశ్నిస్తోన్నారు. సిద్ధిక్ హత్యకు వారం రోజుల కిందటే కర్నాల్ సింగ్, ధరమ్ రాజ్ కశ్యప్‌‌‌కు భారీ మొత్తంలో సుపారీ ఇచ్చినట్లు తేలింది. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు సైతం ఇటీవలే పార్సిల్ రూపంలో వారికి అందాయి.

కాగా- కరడుగట్టిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వారిగా అనుమానిస్తోన్నారు. ఈ విషయాన్ని ఇంతవరకు పోలీసులు ధృవీకరించలేదు. వారికి సుపారీ ఎవరిచ్చారు? ఆయుధాలు ఎక్కడి నుంచి అందాయి? వాటిని ఎవరు పంపించారు? అనే విషయాలపై కూపీ లాగుతున్నారు.

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು