న్యూఢిల్లీ: న్యాయ దేవతకు గంతలు తొలగిపోయాయి. సుప్రీంకోర్టులో కొత్తగా ఏర్పాటు చేసిన న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు లేవు. అంతేగాక, ఇన్నాళ్లూ న్యాయదేవత కుడి చేతిలో న్యాయానికి ప్రతిబింభంగా నిలిచే త్రాసు, ఎడమ చేతిలో ఖడ్గం ఉండేవి. అయితే, సుప్రీంకోర్టులో కొత్తగా ఏర్పాటు చేసిన న్యాయదేవత విగ్రహం ఎడమ చేతిలో ఖడ్గానికి బదులుగా రాజ్యాంగం ఉండటం గమనార్హం.
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఈ మార్పులు చేశారు. కళ్లకు గంతలను తొలగించడం అనేదాని ఉద్దేశం దేశంలో చట్టం గుడ్డిది కాదని నిరూపించడమే. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల లైబ్రరీలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని తయారు చేయాలని సీజేఐ డీవై చంద్రచూడ్ స్వయంగా ఆదేశించారు.
అయితే, ఇన్నాళ్లూ న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు కట్టడం, చేతిలో ఖడ్గం ఉంచడం వెనుక కారణం లేకపోలేదు. చట్టం ముందు అందరూ సమానమే.. న్యాయస్థానం డబ్బు, అధికారం, ఇతర హోదా చూడదు అనే సందేశామిచ్చేందుకే న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు కట్టారు. మరోవైపు, చేతిలో ఉంచే ఖడ్గం విషయానికొస్తే.. అన్యాయాన్ని న్యాయదేవత చీల్చిచెండాడుతుందని సంకేతం ఇచ్చేందుకు ఇలా న్యాయదేవత విగ్రహం చేతిలో ఖడ్గం ఉంచారు.
ఇంత గొప్ప సందేశం ఉన్నప్పుడు మరి న్యాయదేవత విగ్రహంలో మార్పులు చేర్పులు ఎందుకు చేశారనే సందేహం కలగడం సహజం. బ్రిటీష్ ఛాయల నుంచి భారతదేశం న్యాయవ్యవస్థ బయటపడాలనే ఉద్దేశంతోపాటు చట్టం గుడ్డిది కాదని, రెండు కళ్లు తెరిచి అందరినీ సమానంగానే చూస్తుందని చాటి చెప్పే ఉద్దేశంతో జస్టిస్ చంద్రచూడ్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించినట్లు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.కాగా, న్యాయ స్థానాలలో మనం తరచుగా చూసే న్యాయదేవత నిజానికి గ్రీకు దేవత. ఆమె పేరు జస్టియా. ఆమె పేరు నుంచి జస్టిస్ అనే పదం వచ్చింది. 17వ శతాబ్ధంలో ఒక బ్రిటీష్ అధికారి ఈ విగ్రహాన్ని తొలిసారి భారతదేశానికి తీసుకువచ్చారు. ఈ అధికారి కోర్టుకు సంబంధించిన అధికారి. 18వ శతాబ్ధంలో బ్రిటీష్ రాజ్ కాలంలో న్యాయదేవత విగ్రహం ప్రజల వినియోగంలోకి వచ్చింది. ఇక, భారతదేశానికి స్వతంత్ర వచ్చిన తర్వాత కూడా ఇదే విగ్రహాన్ని కొనసాగిస్తున్నారు