ఏపీలో మూడు పార్టీల నేతల్లో ఉత్కంఠ పెరుగుతోంది. నామినేటెడ్ పదవుల రెండో జాబితా కసరత్తు తుది దశకు చేరింది. తొలి విడత జాబితాలో తమకు అవకాశం దక్కుతుందని భావించి.. నిరాశ చెందిన వారు ఇప్పుడు రెండో లిస్టు కోసం వెయిట్ చేస్తున్నారు. మూడు పార్టీల నుంచి పోస్టుల కోసం పెద్ద సంఖ్యలో పోటీ ఉంది. పవన్ తమ పార్టీ నుంచి పదవులు ఇవ్వాల్సిన వారి జాబితా సీఎం చంద్రబాబుకు అందించారు. దీంతో, ఏ క్షణమైనా రెండో విడత నామినేటెడ్ పదవులు ప్రకటించే అవకాశం ఉంది.
జాబితా పై కసరత్తు
నామినేటెడ్ పోస్టుల కోసం కూటమి లోని మూడు పార్టీల నుంచి పోటీ పెరుగుతోంది. టీడీపీ నుంచే దాదాపు 30 వేల మంది తమకు పోస్టులు ఇవ్వాలంటూ అధినాయకత్వానికి వినతులు ఇచ్చారు. జనసేన, బీజేపీ నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర స్థాయి పదవులతో పాటుగా జిల్లాలో ఉన్న పోస్టుల పైన ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. రాష్ట్ర స్థాయిలో దాదాపుగా 150 వరకు ఛైర్మన్ పదవులు ఉన్నాయి. అదే విధంగా ఆలయాల పాలక మండళ్లు సభ్యుల సంఖ్య దాదాపు 1600 వరకు ఉన్నాయి. వీటిని మూడు పార్టీలకు పంపకాలు చేసే విధంగా ఇప్పటికే ఒక ఫార్ములా సిద్దం చేసారు. దీంతో.. రెండు వేల వరకు పదవులు ఇచ్చే అవకాశం ఉంది.మూడు పార్టీల ఒప్పందం
ఇక, కార్పోరేషన్ల తో పాటుగా ఫెడరేషన్ల లో పెద్ద సంఖ్యలో అవకాశం కల్పించే ఛాన్స్ కనిపిస్తోంది.
ఇప్పటికే చేసుకున్న ఒప్పందం ప్రకారం మొత్తం నామినేటెడ్ పదవుల్లో జనసేన – బీజేపీకి దాదాపు 20 శాతం మేర పదవులు దక్కనున్నాయి. తొలి జాబితాలో 20 పదవులు ఖరారు చేయగా, వాటిలో జనసేనకు 3, బీజేపీ 1 దక్కాయి. అయితే, పదవులు ఆశిస్తున్న వారు తమకు ఛైర్మన్ హోదా కట్టబెట్టాలని పార్టీలోని ముఖ్య నాయకత్వం ద్వారా ఒత్తిడి చేస్తున్నారు. తొలి జాబితాలో డైరెక్టర్ల పదవులు కేటాయించిన వారు తమకు అవసరం లేదంటూ లేఖలు రాసారు. వారిలో శిష్ట్లా లోహిత్, సప్తగిరి ప్రసాద్ వంటి కొందరు నేతలు ఉన్నారు. ఇక, టీటీడీ బోర్డు కూర్పు ద్వారా తమ ఎంపిక విధానం ఎలా ఉంటుందో పార్టీ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది.
వీరికే ప్రాధాన్యత
పార్టీ ఇస్తున్న సంకేతాల మేరకు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ కోసం కష్ట నష్టాలు భరించిన వారికే ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. కేసుల్లో ఉన్నవారితో పాటుగా, నాడు అధికార పార్టీ దాడులకు గురైన వారికి తొలి ప్రాధాన్యత ఇస్తామని తేల్చి చెబుతున్నారు. సుదీర్ఘ కాలం పార్టీ కోసం పని చేసిన వారికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో అన్ని ప్రాంతాలను పరిగణలోకి తీసుకుంటూ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎంపిక ఉంటుందని పార్టీ స్పష్టం చేసింది. అదే సమయంలో సరైన నిష్పత్తిలో మహిళలు, యువత కు అవకాశం దక్కనుంది. ఈ తరహా కూర్పుతో చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది. దీంతో, మూడు పార్టీల నుంచి రెండో జాబితాలో ఉండే పేర్ల పైన ఆసక్తి పెరుగుతోంది.
Author: VS NEWS DESK
pradeep blr