Search
Close this search box.

మోదీ ప్రతిపాదనకు జగన్ నో – ఇరకాటంలో కూటమి..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్రం తాజాగా ప్రతిపాదించిన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. ముస్లిం హక్కులను .. మనోభావాలను కాల రాసే చట్టాలకు తమ మద్దతు ఉండదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో టీడీపీ, జనసేన నిర్ణయం ఏంటనేది స్పష్టం కావాల్సి ఉంది. వక్ఫ్ బిల్లు ను వ్యతిరేకించాలని తాజాగా జమైత్ ఉలేమా సీఎం చంద్రబాబును కోరింది.

వైసీపీ వ్యతిరేకం
ముస్లిం సమాజానికి ఎల్లవేళలా అండగా ఉండి తమ పార్టీ పోరాడుతుందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత విజయ సాయిరెడ్డి స్పష్టం చేశారు. అందుకే వక్ఫ్‌ బిల్లుకు తమ పార్టీ వ్యతిరేకమని ఆయన వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్‌ సవరణ చట్టంలో ముస్లిం సోదరులకు వ్యతిరేకంగా ఉన్న 8 పాయింట్లను పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఆదేశాల మేరకు వ్యతిరేకించామని విజయ సాయిరెడ్డి వెల్లడించారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం బీజేపీతో చేతులు కలిపి బిల్లును పాస్‌ చేయించడానికి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

సాయిరెడ్డి ప్రకటన
గత పార్లమెంటు సమావేశాలకు ముందు కేబినెట్‌లో ఆ బిల్లును టీడీపీ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్‌ నాయుడు ఆమోదించారని గుర్తు చేసారు. నిజంగా ఆ పార్టీ వక్ఫ్‌ బిల్లును వ్యతిరేకిస్తే, టీడీపీ మంత్రులు రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి బయటకు రావాలని డిమాండ్ చేసారు. ముస్లిం సమాజానికి నష్టం జరిగే విధంగా ఉన్న వక్ఫ్‌ సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తి లేదని స్పష్టం చేసిన ఆయన, ముస్లింల తరఫున పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. వక్ఫ్‌ బోర్డులో ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చడాన్ని, సీఈవోలుగా నియమించడాన్ని కూడా ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు.

చంద్రబాబు అడ్డుకోవాలి
ఇదే సమయంలో జమైత్ ఉలేమా ఏపీ సీఎం చంద్రబాబుకు తాజాగా ఈ బిల్లు వ్యతిరేకించాలని అభ్యర్ధించింది. ముస్లింల మనోభావాలను గౌరవించి వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించాలని .. ప్రమాదకరమైన ఈ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా దూరంగా ఉండాలని కోరింది. ఒక వేళ ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రభుత్వానికి ఊత కర్రలుగా ఉన్న జేడీ(యూ), టీడీపీ ఈ రెండు లౌకిక పార్టీలు బాధ్యత నుంచి తప్పించుకోలేవని ఆ సంస్థ అధిపతి మౌలానా అర్షద్ మదాని హెచ్చరించారు. ముస్లింల మనోభావాలను చంద్రబాబుకు తెలిపేందుకు త్వరలో ఏపీలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. ఇప్పుడు వైసీపీ తమ విధానం ప్రకటించటంతో కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన ఏం చేయబోతున్నాయనేది ఆసక్తి కరంగా మారింది.

 

VS NEWS DESK
Author: VS NEWS DESK

pradeep blr

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು