Telangana Liquor Supplies: తెలంగాణలోని మందుబాబులకు నిజంగా ఇది చేదువార్తే. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సరఫరా నిలిచిపోయింది. సాంకేతిక సమస్యల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా మద్యం డెలివరీ నిలిచిపోయినట్లు సమాచారం. ఎక్సైజ్‌శాఖ సాఫ్ట్‌వేర్ రెండ్రోజులుగా మొరాయిస్తుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 19 డిపోల నుంచి వైన్స్, బార్లకు వెళ్లాల్సిన లిక్కర్ సరఫరా నిలిచిపోయింది. గత రెండ్రోజులుగా ‘సీటెల్’ ప్రతినిధులు రంగంలోకి దిగి సమస్యను చక్కదిద్దే పనిలో నిమగ్నమైనా ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ క్రమంలో మ్యానువల్‌గా మద్యం సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పటికే కొందరు మద్యం వ్యాపారులు వందల కోట్ల మద్యానికి డీడీలు కట్టారు. మంగళవారం సాయంత్రానికే సమస్య పరిష్కారమవుతుందని భావించినా ఇప్పటికీ పరిష్కారం కాలేదు. నేడు కూడా ఇదే పరిస్థితి ఉంటే.. మరిన్ని ఇబ్బందులు తలెత్తవచ్చని ఎక్సైజ్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇక మందుబాబులకు కొన్ని ప్రాంతాల్లో తమకు కావలసిన బ్రాండ్లు దొరకటం లేదు. మద్యం సరఫరా నిలిచిపోవటంతో పాత స్టాక్ పూర్తిగా అయిపోయింది. ఇంకొందరు ముందుగానే తమకు కావాల్సిన బ్రాండ్ల మద్యం తెచ్చిపెట్టుకున్నారు. ఇవాళ రాత్రిలోపు సర్వర్ల సమస్య పరిష్కారం దొరికితే.. తెలంగాణలో మద్యం సరఫరా మళ్లీ మొదలవుతుందని అధికారులు అంటున్నారు.
త్వరలో పెరగనున్న మద్యం ధరలు..
రాష్ట్రంలో మందు బాబులకు త్వరలోనే భారీ షాక్ తగిలే ఛాన్స్ ఉంది. మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచార. సర్కార్‌కు అదనపు ఆదాయం అందించేందుకు మద్యం ధరలు పెంచడానికి ఎక్సైజ్ శాఖ ప్లాన్ సిద్ధం చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఒక్కో బీరుపై దాదాపు రూ.20 వరకు ధర పెంచుతారని అలాగే లిక్కర్ బాటిల్స్‌పై వాటి బ్రాండ్లను బట్టి రూ.10 నుంచి రూ. 80 వరకు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు ఎక్సైజ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కొత్తగా సవరించనున్న మద్యం ధరలతో తెలంగాణ సర్కార్‌కు అదనంగా నెలకు రూ.500-రూ700 కోట్ల వరకు సమకూరేలా ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకుంటుంది.
తొలుత మద్యం ధరలు పెంచొద్దని భావించినా.. ఇతర రాష్ట్రాల్లో ధరలు ఎక్కువగా ఉండటం, రాష్ట్ర ఆదాయం తగ్గిపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల మద్యం విక్రయాలతో తెలంగాణ దేశంలో టాప్ ఫ్లేస్‌లో నిలవటం గమనార్హం. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఏడాది తెలంగాణలో సగటున ఒక వ్యక్తి మద్యం కోసం రూ.1,623 ఖర్చు చేసినట్లు తెలిసింది. ఏపీలో సగటున రూ.1,306 వెచ్చించినట్లు నివేదికలు వెల్లడించాయి.
Author: VS NEWS DESK
pradeep blr