Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం నాడు 66,163 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,229 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.86 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 17 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 9 నుంచి 10 గంటల సమయం పట్టింది. శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లల్లో వేచివున్న భక్తులకు సేవకులు అల్పాహారం, మంచినీరు, పాలు అందజేశారు.
ఈ 9వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 8వ తేదీన రాత్రి 8 నుంచి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ చేస్తారు. పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
శ్రీదేవి భూదేవి సమేతుడై మలయప్పస్వామివారు సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో మలయప్ప స్వామివారిని అభిషేకం చేస్తారు.
మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనం ఇస్తారు. దేవేరులతో కలిసి భక్తులను కరుణిస్తారు.
ఈ మహాయాగానికి నేడు అంకురార్పణ చేయనున్నారు టీటీడీ అర్చకులు. ఆగమోక్తంగా అంకురార్పణ చేస్తారు. ఈ మహా పుష్పయాగానికి సర్వదేవతలనూ ఆహ్వానిస్తారు. శనివారం కన్నుల పండువగా పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. పరమ పవిత్ర కార్తీకమాసం శనివారం నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతోన్నందున భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని టీటీడీ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు.
అంకురార్పణ కారణంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. పుష్పయాగం రోజున కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం వంటి ఆర్జితసేవలు రద్దయ్యాయి. తోమాల, అర్చన సేవలను టీటీడీ అర్చకులు శాస్త్రోక్తంగా ఏకాంతంగా నిర్వహిస్తారు.
Author: VS NEWS DESK
pradeep blr