మళ్ళీ నాగార్జునసాగర్ వద్ద ఏపీ, తెలంగాణా వివాదం… కారణం ఏమిటంటే

కృష్ణా జలాల విషయంలో ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాలు కేంద్రం మధ్యవర్తిత్వం తీసుకున్నప్పటికీ నేటికీ పరిష్కారం కాలేదు. ఇక తాజాగా ఏపీ తెలంగాణ అధికారుల మధ్య నాగార్జున సాగర్ వద్ద మరోమారు వివాదం చోటుచేసుకుంది.

నాగార్జున సాగర్ వద్ద ఏపీ, తెలంగాణా అధికారుల వివాదం
నాగార్జునసాగర్ కుడికాలువ వాటర్ రీడింగ్ కోసం తెలంగాణ సిబ్బంది నాగార్జునసాగర్ డ్యాం వద్దకు వెళ్లారు. అయితే అక్కడ ఆంధ్రప్రదేశ్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. తెలంగాణ వారికి మీకు ఇక్కడేం పని అంటూ వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో మరోమారు రెండు రాష్ట్రాల మధ్య అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది.

ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వాగ్వాదం
నీటి విడుదలకు సంబంధించిన లెక్కలు చెప్పేది లేదని రీడింగ్ తియ్యవద్దని వారిని అడ్డుకున్నారు. మీరు ఎవరికైనా చెప్పుకోండి అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తెలంగాణ ఇరిగేషన్ అధికారులకు కేఆర్ ఎంబి సమాచార గ్రూపులతో సహా అధికారులందరికీ నాగార్జునసాగర్ డ్యామ్ నిర్వహణ ఇరిగేషన్ సిబ్బంది సమాచారాన్ని అందించారు.

మరోమారు కృష్ణా జలాల విషయంలో వివాదం
ఏపీ అధికారుల తీరుపైన తెలంగాణ అధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఇరు రాష్ట్రాల అధికారులకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అధికారులు నచ్చ చెప్పారు. కాగా నాగార్జునసాగర్ డ్యాం పైన మరోమారు కృష్ణా జలాల విషయంలో వివాదం చోటు చేసుకుంది. రెండు రాష్ట్రాలు విభజన జరిగి పదేళ్లు దాటినప్పటికీ తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాల పంపకం విషయంలో వివాదాలు సమసిపోలేదు.

గత నవంబర్ లో వివాదం.. మళ్ళీ ఈ నవంబర్ లో
ఇప్పటికే పలుమార్లు కూర్చుని మాట్లాడినా, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు జోక్యం చేసుకున్నా, రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పంచాయితీ కేంద్రం వరకు వెళ్లినా పరిష్కారం మాత్రం దొరకలేదు. గత నవంబర్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా నాగార్జునసాగర్ డ్యాం పైన జల వివాదం నేపథ్యంలో ఏపీ, తెలంగాణ పోలీసులు మోహరించడంతో యుద్ధ వాతావరణం కొనసాగింది. మళ్ళీ ఇప్పుడు ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పైన వివాదం చోటుచేసుకుంది.

ಬಿಸಿ ಬಿಸಿ ಸುದ್ದಿ

ಕ್ರಿಕೆಟ್ ಲೈವ್ ಸ್ಕೋರ್

ಚಿನ್ನ ಮತ್ತು ಬೆಳ್ಳಿ ಬೆಲೆಗಳು