సోషల్ మీడియా వేధింపుల గురించి ఏపీలో పెద్ద రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో కూటమి ప్రభుత్వం, ఆ పార్టీల నాయకులపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారిపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేస్తోంది. తాజాగా సోషల్ మీడియా వేధింపుల పర్వం మన పక్క రాష్ట్రం మహారాష్ట్రను కూడా తాకింది. ఏకంగా ఓ మహిళా ఎంపీ తనకు వ్యతిరేకంగా ఓ హీరో అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర మహిళా ఎంపీ ప్రియాంక చతుర్వేది బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌పై సంచలన కామెంట్స్ చేశారు.
మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోయాయి. రీసెంట్గా లాతూర్‌లో జరిగిన ర్యాలీలో తన సోదరుడు, కాంగ్రెస్ అభ్యర్థి ధీరజ్ దేశ్‌ముఖ్ కోసం బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ మత రాజకీయాలపై రితేశ్ దేశ్‌ముఖ్ ఘాటు విమర్శలు చేశారు. మతాన్ని భోదించే వాళ్లకు చెప్పండి, మేం ధర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం, వీటి బదులుగా మన జీవితాల్ని ప్రభావితం చేసే నిజమైన సమస్యల గురించి మాట్లాడుకుందమని రితేశ్ దేశ్‌ముఖ్ బీజేపీకి సవాల్ విసిరారు. రితేశ్ దేశ్‌ముఖ్ ఎన్నికల ప్రచార వీడియోను ప్రియాంక చతుర్వేది ట్విట్టర్లో షేర్ చేశారు. దీంతో బీజేపీకి మద్దతుగా ఉన్న అక్షయ్ కుమార్ అభిమానులు ప్రియాంక చతుర్వేదిని టార్గెట్ చేసుకుని ట్రోలింగ్‌కు దిగారు.
ఆమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీని స్పందించిన ప్రియాంక చతుర్వేది తన ట్విట్టర్లో సుదీర్ఘ పోస్ట్ ఒకటి షేర్ చేశారు. తనని లక్ష్యంగా చేసుకుని హ్యాష్‌ట్యాగ్‌లు వైరల్ చేసేందుకు కొందరికి డబ్బు చెల్లించారని.. అక్షయ్ కుమార్ ఫ్యాన్ క్లబ్, పెయిడ్ బ్లూ టిక్ ఫిల్మ్ ఇన్ఫ్లుయెన్సర్లకు హ్యాష్‌ట్యాగ్స్ ఇచ్చి మరీ తనపై ట్వీట్లు వేస్తున్నారని ఈమె ఆరోపించారు. అయితే ఇదంతా ఎవరు చేస్తున్నారో తనకు తెలుసని ప్రియాంక చతుర్వేది చెప్పుకొచ్చారు. డబ్బులిచ్చి మరీ ఇలా చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. అక్షయ్ కుమార్‌పై ప్రియాంక చతుర్వేది చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రియాంక చతుర్వేది చేసిన ఆరోపణలు అటు సినీ ఇండస్ట్రీతో పాటు, ఇటు మహారాష్ట్ర రాజకీయాల్లో కూడా సంచలనంగా మారాయి.