Tirumala: తిరుమలలో భక్తుల రద్దీలో మార్పు లేదు. తాకిడి కొనసాగుతోంది. కార్తీకమాసం చివరి రోజులు కావడం వల్ల భక్తులు తిరుమలకు పోటెత్తారు. బుధవారం నాడు 67,626 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,231 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.75 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో మూడు కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో ఉన్న వారికి శ్రీవారి సేవకులు మంచినీరు, పాలు, అల్పాహారాన్ని అందించారు.
కాగా- డిసెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే పర్వదినాలు, విశేష ఉత్సవాల జాబితాను టీటీడీ అధికారులు విడుదల చేశారు. ప్రతి నెలలో శ్రీవారికి నివేదించే కార్యక్రమాలు, పండగలు, వివిధ విశేష ఉత్సవాలకు సంబంధించిన జాబితాను సంబంధిత నెల ప్రారంభానికి ముందే విడుదల చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు అధికారులు.
ఇందులో భాగంగా డిసెంబర్‌లో నిర్వహించే పండగల జాబితాను విడుదల చేశారు. 1వ తేదీన శ్రీవారి ఆలయంలో 4వ విడత అధర్వణ వేదపారాయణంతో ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు టీటీడీ అధికారులు. 30వ తేదీన అధ్యయనోత్సవాలతో ఇవి ముగుస్తాయి.
11వ తేదీన సర్వ ఏకాదశి, 12న చక్రతీర్థ ముక్కోటి, 13న తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర ఉత్సవాలను నిర్వహించనున్నారు. 14వ తేదీన తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్ర కార్యక్రమం ఉంటుంది. 15న శ్రీవారి ఆలయంలో మహిమాన్వితమైన కార్తీక దీపోత్సవాన్ని కన్నుల పండువగా జరుపునున్నారు.16వ తేదీన ధనుర్మాసం ఆరంభమౌతుంది. ఈ మాసంలో తిరుప్పావై పాశురాలను పఠిస్తారు. ధనుర్మాసం ముగిసేంత వరకూ ఈ పాశురాలు తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణనాన్ని రెట్టింపు చేస్తాయి. 26న సర్వ ఏకాదశి, 29న మాస శివరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తారు. అదే రోజున తొండరడిప్పొడియాళ్వార్ వర్ష తిరు నక్షత్ర కార్యక్రమం ఉంటుంది. 30న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభమౌతాయి.
Author: VS NEWS DESK
pradeep blr