Sabarimala: కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. రోజూ వేలాదిమంది దర్శించుకుంటోన్నారు. భక్తిశ్రద్ధలతో మణికంఠుడిని కొలుస్తోన్నారు. 40 రోజుల పాటు సాగే మండలం పూజా కార్యక్రమాల్లో పాల్గొంటోన్నారు.కిందటి నెల 16వ తేదీన మండలం పూజల కోసం అయ్యప్ప స్వామివారి ఆలయం తెరచుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 26వ తేదీన మండలం పూజలు ముగియనున్నాయి. దీనితో శబరిమల అయ్యప్ప సన్నిధానం తలుపులను మూసివేస్తారు అర్చకులు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.మండలం పూజలు ముగిసే సమయంలో పథనంథిట్టలోని ఆరన్ములలో గల ప్రఖ్యాత శ్రీ పార్థసారథి ఆలయం నుంచి బంగారు నగరాలను ఊరేగింపుగా తీసుకొని వచ్చి అయ్యప్ప స్వామికి ధరింపజేయడం ఆనవాయితీగా వస్తోంది. సరిగ్గా నాలుగు రోజుల ముందు ఈ కార్యక్రమం ఆరంభమౌతుంది.
తాజాగా బంగారు నగల ఊరేగింపు ఈ తెల్లవారుజామున ఆరన్ములలో ప్రారంభమైంది. దీన్ని థంక అంకిగా పిలుస్తారు. ఈ నెల 25వ తేదీ వరకు ఊరేగింపు కొనసాగుతుంది. బుధవారం అయ్యప్ప స్వామి సన్నిధిలో దీపారాధాన, బంగారు నగలను తొడిగించడంతో ఈ కార్యక్రం ముగుస్తుంది.
మర్గమధ్యంలో నాలుగు చోట్ల ఆగుతుంది ఈ ఊరేగింపు. తొలి రోజున రక్తకందస్వామి ఆలయం, రెండో రోజున కొణ్ణి మురింగమంగళం శ్రీ మహాదేవ దేవస్థానం, మూడో రోజు రణ్ణి పెరునాడ్‌లోని శ్రీ ధర్మశాస్త ఆలయంలో ఆగుతుంది. నాలుగో రోజున నీలక్కల్ శివాలయం, పంపాలోని గణపతి దేవాలయంలో పూజలను నిర్వహిస్తారు. అనంతరం సన్నిధానానికి చేరుకుంటుంది.
ఇప్పటివరకు 24 లక్షలమంది వరకు భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. 26వ తేదీ నాటికి ఈ సంఖ్య మరింత భారీగా పెరుగుతుందని అంచనా వేస్తోన్నారు. మళ్లీ మకరవిళక్కు కోసం ఈ నెల 30వ తేదీన స్వామివారి ఆలయాన్ని తెరుస్తారు. జనవరి 20వ తేదీ వరకు మకరవిళక్కు పూజలు కొనసాగుతాయి.
Author: VS NEWS DESK
pradeep blr