Dr Manmohan Singh: ప్రఖ్యాత ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి అంత్యక్రియలు ముగిశాయి. దేశ రాజధానిలోని నిగమ్ బోధ్ ఘాట్ వద్ద అంత్యక్రియలను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ అధికార లాంఛనాలంతో ఈ కార్యక్రమం కొనసాగింది.
నిగమ్ బోధ్ ఘాట్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి, కొందరు మంత్రులు నివాళి అర్పించారు.
ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్, స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా.. తదితరులు ఆయన పార్థివదేహానికి నివాళి అర్పించారు. చివరిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బాధాతప్త హృదయంతో నివాళి అర్పించారు. సెల్యూట్ చేశారు. ఆ సమయంలో అందరూ లేచి నిల్చుని మౌనం పాటించారు.
భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్, మారిషస్ విదేశాంగ మంత్రి మనీష్ గోబిన్.. ఆయనకు నివాళి అర్పించిన వారిలో ఉన్నారు. ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సహా పలువురు మంత్రులు, అధికారులు, వివిధ దేశాల ప్రతినిధులు అంత్యక్రియలకు హాజరైన వారిలో ఉన్నారు.
ద్రౌపది ముర్ము నివాళి అర్పించిన అనంతరం మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని చితిపైకి తీసుకొచ్చారు. సిక్కుల సంప్రదాయంలో అంత్యక్రియలను చేపట్టారు. ఆ సమయంలో సిక్ పెద్దలు సంప్రదాయబద్ధమైన కృపాణులను ధరించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు ప్రార్థనలను నిర్వహించారు.
అనంతరం ఆర్మీ జవాన్లు మన్మోహన్ సింగ్ గౌరవార్థం గాలిలోకి కాల్పులు జరిపారు. తరువాత ఆయన పార్థివదేహాన్ని ఉంచిన చితికి నిప్పంటించారు. ఆ సమయంలో నిగమ్ బోధ్ ఘాట్ వద్ద గంభీర వాతావరణం నెలకొంది. ప్రధాని మోదీ సహా అక్కడున్న వాళ్లందరూ విషాదఛాయలతో కనిపించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కన్నీరు పెట్టారు. చితి చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
Author: VS NEWS DESK
pradeep blr