అమరావతి, మార్చి 15: గుంటూరు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మేయర్ తన పదవికి రాజీనామా చేశారు. వైసీపీ నాయకుడు కావటి మనోహర్ నాయుడు తన మేయర్ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో గుంటూరు రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. ఈ వ్యవహానంపై అనేకానేక చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఆ చర్చలన్నింటికీ చెక్ పెడుతూ మనోహర్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మేయర్ పదవికి రాజీనామా చేసినప్పటికీ.. వైసీపీ, జగన్‌ను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు చూస్తున్నారని.. మున్సిపల్ కార్పొరేషన్ చేస్తున్న పనితీరును పత్రికల ద్వారా ప్రజల సభలో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా సభ నుంచి కమిషనర్ వెళ్లిపోయారని విమర్శించారు. సభలో ఉన్న సభ్యులను అగౌరవ పరుస్తూ సభ నుండి వెళ్లిపోయారన్నారు. జనవరి 8 తేదీన సమావేశం పెట్టాలని లిఖిత పూర్వకంగా అడగడం జరిగిందని మనోహర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్టాండింగ్ కమిటీ ఎమ్మెల్సీ ఎన్నికలు అని చెప్పి కౌన్సిల్ సమావేశం జరుగకుండా 2 నెలలు వాయిదా వేశారని విమర్శించారు. ఈ నెల 6 వ తేదీన కౌన్సిల్ నిర్వహించడానికి కమిషనర్‌కు లెటర్ రాశానని చెప్పారు.
బుడమేరు ఘటనలో ఆయన చేసిన అవినీతి బట్టబయలు అవుతుందని కౌన్సిల్ సమావేశం పెట్టడం లేదంటూ మనోహర్ తీవ్ర ఆరోపణలు చేశారు. గుంటూరు నగర పాలక సంస్థలో మేయర్‌కి జరిగిన అవమానం ఏ జిల్లాలో చూసి వుండరన్నారు. స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా తాను వున్నానని.. స్టాండింగ్ కమిటీ సమావేశం ఎప్పుడు పెట్టాలని తనతో చర్చించకుండా నేరుగా సోమవారం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన వ్యాఖ్యానించారు. మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. నాలుగు సంవత్సరాలు నగరంలో ఎంతో అభివృద్ధి చేశామన్న మనోహర్ నాయుడు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేయర్‌కి ఎన్నో అవమానాలు చేశారని ఆరోపించారు. నగర పాలక సంస్థలో ఉన్న తన కార్యాలనికి వెళ్ళాలంటే తాళాలు ఉండేవి కావన్నారు. మేయర్ చాంబర్‌లో ఉన్న అటెండెర్స్‌ను తీసేశారి ఆయన ఆరోపించారు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక కేంద్ర మంత్రి కలిసి కార్పొరేటర్ ఇంటికి వెళ్లి కూరగాయలు కొన్నట్టు వైసీపీ కార్పొరేటర్‌లను కొన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. 9 నెలలుగా తనను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని.. తప్పుడు కేసులు పెట్టారని మనోహర్ ఆరోపించారు. మేయర్ పదవి వదులుకోడానికి సిద్ధంగా ఉన్నానన్న ఆయన.. వైసీపీ నుండి బయటకు వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.